Saturday, May 3, 2008

ఆముఖమ్‌ - 2

శ్లో|| త్రిమూర్త్యాత్మావతారోஉయం
నైకమూర్తేర్దశాஉకృతౌ
గణ్యతె కృష్ణరూపోஉయం
దత్తః పూర్ణతమాకృతిః

తా|| శ్రీకృష్ణుడు త్రిమూర్తుల ఆత్మయగు శ్రీ దత్తుని అవతారము. అందువలన, త్రిమూర్తులలో ఒక మూర్తియగు విష్ణువు యొక్క దశావతారములలో యీ కృష్ణావతారము చెప్పబడుటలేదు. ఇది త్రిమూర్త్యాత్మక మూల పర బ్రహ్మయగు శ్రీ దత్తుని పరిపూర్ణ తమావతారము.(పరిపూర్ణతమస్సాక్షాత్, శ్రీ కృష్ణోనాన్య ఏవహి అని శాస్త్రోక్తి).

శ్లో|| నవనీతప్రియః కృష్ణః, క్షీరం దత్తప్రియం తతః
నవనీతం పయోజాతం, కృష్ణోదత్తా త్సమాగతః

తా|| వెన్న కృష్ణునకు ఇష్టమైనది. పాలు దత్తునకు ఇష్టమైనవి. పాలనుండి వెన్న సంభవించినట్లు దత్తుని నుండి శ్రీ కృష్ణుడు అవతరించినాడు. శ్రీ దత్త భగవనుడు సదా బ్రహ్మజ్ఞానమును బోధించుట చేత గురురాజుగా ఉన్నాడు. శ్రీ కృష్ణుడును గీతాబోధ చేత గురురాజుగా వెలసినాడు. ఇంత ఏల? - శ్రీ కృష్ణుని విశ్వరూపములో మధ్యస్ధానమున బ్రహ్మ-విష్ణు-శివ ముఖములతో యోగీశ్వరుడగు శ్రీ దత్త భగవానుడే నిలచి దర్శనమిచ్చెను.

శ్లో|| రాజేశ్వర సమార్ధత్వా, ద్యోగిరాజోஉయ మీశ్వరః
సర్వదేవాస్యనేపధ్య - మధ్యే షష్టీహి కారణే.

తా|| రాజ = ఈశ్వర శబ్దాలు పర్యాయ పదములు. యోగీశ్వరుడనగా యోగిరాజు అగు శ్రీ దత్తుడే. విశ్వరూపములో మధ్యలో త్రిముఖుడగు శ్రీ దత్తభగవానుడు నిలచియుండగా, ఆయనయొక్క సర్వవేషములగు సర్వదేవతల ముఖములును, ఇరుప్రక్కల ఉన్నవి. శ్రీ కృష్ణుడు అర్జునునితో "పశ్య ! మే యోగమైశ్వరమ్" అన్నాడు. అనగా "నా యోగీశ్వర స్వరూపమును చూడుము" అని అర్ధము. ఇచట "నా" అను షష్టీ విభక్తి, తన కృష్ణావతారమునకు మూలకారణమగు యోగిరాజు అగు దత్తుని చెప్పుచున్నది. "హేతౌషష్ఠీ" అని కదా!

శ్లో|| త్రిముఖైర్బ్రహ్మ నిశ్చిత్య, ముఖకర్మణి సంశయమ్
ఛేత్తుం పురాణ సిద్ధంచ, విశ్వరూప ప్రదర్శనమ్

తా|| త్రిమూర్తుల మూడు ముఖములచేత తానే పరబ్రహ్మమని నిశ్చయించబడిన శ్రీ దత్త భగవానుడు కృష్ణావతారమున విశ్వరూప ప్రదర్శనమును చేయుటకు కారణమేమనగా - అసలు ఆ త్రిమూర్తులు సృష్టి, స్ధితి, లయములు చేయుచున్నారని పురాణములలో చెప్పబడిననూ దానికి ప్రత్యక్ష ప్రమాణమేమిటి? శ్రీ దత్తుడే త్రిమూర్త్యాత్మకుడగుటకు ప్రత్యక్ష ప్రమాణమగు ఆయన స్వరూపమున్నది గదా. అట్లే త్రిమూర్తుల అధికారములకు ప్రత్యక్షమేమిటి ? అను సంశయము రాగా, దానిని నివారించుటకై కృష్ణావతారమును ఎత్తినాడు.

శ్లో|| సాధర్మ దేవతా ధేను, రనుయాతా స్వరక్షణే
అధర్మవ్యాఘ్ర భీతేయం, శ్రీ దత్తం కృష్ణ రూపిణమ్‌

తా|| ధేను రూపంలో ఉన్న ఆ ధర్మదేవత, కృష్ణ రూపమును ధరించిన శ్రీ దత్తుని అనుసరించి వెనుక నిలబడియున్నది. ఈ ధర్మదేవతా ధేనువు, అధర్మమను పులికి భయపడి, తన రక్షణ నిమిత్తము స్వామిని విడనాడకయున్నది.

No comments: