శ్లో || బ్రహ్మోపేన్ద్ర శివాననై స్త్రి జగతాం సృష్టి స్ధితి ధ్వంసకృ
ద్దత్తో బ్రహ్మస ఏక ఏవ నిగమేహేతుద్వయాన్నిశ్చితమ్
విశ్వోత్పత్తి భృతిక్షయాన్విహితవా న్యో విశ్వరూపః పరం
కృష్ణః పూర్ణతమావతార ఉదిత స్తత్కర్మ సన్దర్శయన్.
తా|| బ్రహ్మ-విష్ణు-శివ ముఖములతో త్రిలోకములను, సృష్టించి పాలించి లయింపచేయువాడును, ఒకే ఒకడుగ శ్రీ దత్తుడే బ్రహ్మమని వేదములో చెప్పబడిన బ్రహ్మము యొక్క నిర్వచనములోని రెండు అంశములను పరిపూర్ణ సమన్వయమైనందు నిశ్చయించబడినది. "యతోవా..." "ఏకమేవ.." అని రెండు లక్షణములు బ్రహ్మమునకు చెప్పబడినవి. అయితే యీ మూడు త్రిమూర్తుల ముఖములు విశ్వమును సృష్టించి, పాలించి, లయింపచేయుటయను మూడు పనులను ప్రత్యక్షముగా చూపించుటకై, శ్రీ దత్తుడు పూర్ణతమమైన శ్రీ కృష్ణావతారమునెత్తి, మధ్య మూడు ముఖములలో యోగిరాజు అను శ్రీ దత్తుని మూలరూపములో నిలచి, విశ్వమును సృష్టించి కొంతసేపు ధరించి చివరకు తనలో ఉపసంహరించికొని యీ త్రిమూర్తులే ఆ మూడు పనులను చేయుచున్నారనియు, ఆ త్రిమూర్తులే తానొక్కడే ననియు నిరూపించినాడు.
శ్లో|| దత్తావధూత స్సంవాదీ, యదోర్వంశేஉవ రీర్ణవాన్
పితృశాపాస్త రాజత్వం, దాతుం కృష్ణ ఇతిశ్రితః.
తా|| అవధూతయదు సంవాదానంతరము, శ్రీ దత్తాత్రేయ భగవానుడు ఆ అవధూత, తండ్రియగు యయాతి శాపము చేత అస్తమించిన రాజ్యాధికారమును మరల యదువంశమునకు ప్రసాదించుటకై కృష్ణుడను పేరుతో పిలువబడుచు,యదువంశమునందు అవతరించెను.
శ్లో|| జారత్వ చోరత్వ గుణాది మాయా
సిద్దిప్రకాశో ముహురాత్మ యోగాత్
గీతార్ధ బోధా ద్గురు రాజ భావో
యోగీశ్వరోஉదృశ్యత విశ్వరూపే.
తా|| శ్రీ దత్త భగవానుని లక్షణములన్నియును శ్రీ కృష్ణావతారమున స్పష్టముగ గో్చరించినవి. శ్రీ దత్తుడు మద్యపాన-వేశ్యాలోలత్వము మొ|| దుర్గుణమాయచే కప్పబడియుండును. శ్రీ కృష్ణుడును అట్లే దొంగతనము, వ్యభిచారము మొ|| దుర్గుణమాయచే కప్పబడియుండును. (దీనివలన అజ్ఞానులు తనను చేరరు). ఆత్మయోగముచేత మాటి మాటికిని అష్టసిద్దులు (మహిమలు) ఇద్దరిలోను వ్యక్తమగుట సమానమే.
శ్లో|| చత్వారశ్శునకాః ఖరస్వరగళా జీవాఃపదాలమ్బిన
స్సేవా పుణ్యఫలాత్కఠోర నిగమాస్తే స్వామినాహ్యుద్దృతాః
ఆస్యేరన్ద్ర చ్తుష్టయేన మురళీ రూపేణచైకీకృతా
స్సన్నాదైర్మధురామృత స్రవరసైస్తత్సేవయా తత్ఫలమ్.
తా|| నాలుగు కఠోర నిష్టాపరవేదములు, పరుషస్వర కంఠములు కలవియై జీవ భావంతో వేదపురుషులు స్వామి పాదముల వద్ద వ్రేలాడుచూ, సేవచేసిన పుణ్యఫలము వలన శ్రీ దత్తస్వామిచే పాదముల నుండి ఉద్దరింపబడి ముఖ స్ధానమున ఉంచబడినారు. మరియు నాల్గు వేదములు నాల్గు రంధ్రములతో గల మురళిగా ఐక్యము చెంది ఒకే వేదముగా మారినారు. వారి పరుష స్వరమైన కర్మ మార్గము, మధురామృత స్రవరసమయములగు మంచి నాదములతో భక్తిగా మారినది. ఆయన సేవకు అదీ ఫలితము.
శ్లో|| కఠోర నిష్ఠా యజ్ఞాది - కర్మవేద శ్శ్వరూపవన్
ఉద్దృతో మధురాభక్తిః వేణుస్సంసూచితో యతః
తా|| కఠోర నిష్టలతో కూడిన యజ్ఞాచరణమయమైన, శునక రూపముననున్న వేదము, ఉద్దరింపబడి, మధురభక్తి రూపమైన వేణువుగా మారినదని దీనిచేత సూచింపబడినది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment